Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భర్త చిన్నవాడైనా ఓకే.. పెళ్లిపై మారిన యువతరం ఆలోచన!

Husband being younger is okay how the mindset of youth on marriage has changed
Advertisement
  • పెళ్లి సంబంధాల్లో 1 నుంచి 3 ఏళ్ల వయసు తేడాకే నేటి తరం ప్రాధాన్యం
  • వయసులో 5 ఏళ్లకు పైగా తేడా ఉంటే లక్షల జీతం ఉన్నా తిరస్కరణ
  • పురుషుడే వయసులో పెద్దగా ఉండాలన్న భావనలో మార్పు
  • భర్త చిన్నవాడైనా అంగీకరిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుదల
  • ఒకే తరం, ఒకే జీవనశైలి కోరుకోవడమే ఈ మార్పుకు కారణం
Advertisement
ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో వధూవరుల మధ్య ఐదు, పదేళ్ల వయసు తేడా ఉన్నా ‘ఈడూ జోడూ బాగుంది’ అని మురిసిపోయేవారు. అబ్బాయి వయసులో కాస్త పెద్దవాడైతేనే బంధం నిలబడుతుందని, పరిణతితో సంసారాన్ని నడిపిస్తాడని బలంగా నమ్మేవారు. కానీ, కాలం మారింది. డిజిటల్ యుగంలో పుట్టిపెరిగిన నేటి తరం యువత, పెళ్లి బంధంపై సరికొత్త నిర్వచనాలు రాస్తోంది. వయసు అంతరం (ఏజ్ గ్యాప్) అనే అంశం ఇప్పుడు వధూవరుల ఎంపికలో అత్యంత కీలక ఫిల్టర్‌గా మారింది.

లక్షల జీతం ఉన్నా.. ఆ గ్యాప్ ఉంటే వద్దు!
ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్ల సమాచారం ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. రూ.20 లక్షల వార్షిక వేతనం, నగరంలో సొంతిల్లు, సమాజంలో మంచి హోదా.. ఇవన్నీ ఉన్నప్పటికీ, అబ్బాయి వయసు అమ్మాయి కంటే 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే చాలు, దాదాపు 65 శాతం మంది యువతులు ఆ ప్రొఫైళ్లను ప్రాథమికంగానే తిరస్కరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని 78 శాతం మంది యువత, తమకు కాబోయే భాగస్వామితో కేవలం 1 నుంచి 3 ఏళ్ల వయసు వ్యత్యాసం మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారు.

ఈ మార్పు ఇక్కడితోనే ఆగలేదు. పెళ్లిలో పురుషుడే పెద్దవాడై ఉండాలనే సంప్రదాయ ఆలోచనా ధోరణి కూడా క్రమంగా బలహీనపడుతోంది. భార్యాభర్తల మధ్య వయసు తేడా కేవలం కొన్ని నెలలు ఉండటమే కాదు, అబ్బాయి అమ్మాయి కంటే ఆరు నెలల నుంచి ఏడాది చిన్నవాడైనా పర్వాలేదని అంగీకరిస్తున్న వారి సంఖ్య 4 శాతానికి పెరగడం గమనార్హం. ఇది చిన్న శాతమే అయినా, మారుతున్న సామాజిక దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తోంది.

స్నేహమే కావాలి.. అందుకే ఈ మార్పు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) గణాంకాలు కూడా ఈ పరిణామాన్ని ధ్రువీకరిస్తున్నాయి. 1956-60 మధ్య కాలంలో భార్యాభర్తల సగటు వయసు వ్యత్యాసం 7 ఏళ్లుగా ఉండగా, 2010 నాటికి అది 4.5 ఏళ్లకు తగ్గింది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఈ వ్యత్యాసం 1 నుంచి 3 ఏళ్లకే పరిమితమైంది.

సామాజిక విశ్లేషకుల ప్రకారం, ఈ మార్పుకు ప్రధాన కారణం నేటి యువత బంధాల నుంచి కోరుకుంటున్న స్వభావమే. కళాశాలల్లో మొదలయ్యే ప్రేమ వివాహాల్లో సహజంగానే ఇద్దరి వయసు సమానంగా ఉంటుంది. ఇదే ధోరణి ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలపైనా ప్రభావం చూపుతోంది. "ఒకే తరం, ఒకే రకమైన ఆలోచనలు, ఒకేలాంటి జీవనశైలి" ఉన్నప్పుడే బంధం బలంగా ఉంటుందని, భాగస్వామి కంటే ముందు మంచి స్నేహితుడు/స్నేహితురాలు దొరకాలని వారు భావిస్తున్నారు. వయసులో ఎక్కువ తేడా ఉంటే తరం మారుతుందని, ఆలోచనల్లో పొంతన కుదరదని, బంధంలో స్నేహపూర్వక వాతావరణం లోపిస్తుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే, జాతకాల కంటే ముందు ఏజ్ గ్యాప్‌నే చూస్తున్నారు.
Advertisement
Advertisement
Marriage Age Gap
Indian Youth Marriage Trends
Matrimony Preferences
Younger Groom Trend
Relationship Compatibility
Modern Indian Marriages

More Telugu News